Thursday 13 October 2016

కులం-కలం... రాసే కలానికి కులం అడుగుతూ జనం రాగాల వేణువుకి కులం అడుగుతూ.. వర్గ విభజనతో గతి తప్పుతోంది ఈ జగం కులం కులం అంటూ కుళ్ళు నింపుతుంది కుల మేఘం కమ్ముతుంటే అక్షర వర్షం కురిపించే కలం కదలలేనంటూ ... సామాజిక స్పృహ జనులకు పంచే కలం కుల ఒత్తిడిలో నలిగి రక్తపు సిరా ఒలికిస్తోంది పెత్తందారుల వ్యవస్థలో ముసుగు కప్పుకున్న కులం విలువలు మరిచి కళంకం అంటగడుతూ.. మానవీయత మరిచిన జనం కదలనీయక కలం.. కళ్ళమ్మట సిరా సిరులు నింపుకుంటోంది కులం మరిచి కదలనిస్తే కవిత్వం లో నాట్యం అవుతుంది కలం ఒడిలో కదిలే సిరా కుల వ్యవస్థ భరతం పడుతుంది


//అమ్మ మనసు// పేదరికమెప్పుడూ అమ్మతనాన్ని అంటదేమో.. తనువు నలుగుతున్నా .. తనేమైపోతున్నా కడుపు తీపి ఆకలి కోసమో, గుప్పెడు రూకల కోసమో అంగట్లో మానాన్ని రోజోకో మారు కుదవ పెట్టి కన్న మమకారం కనుమూయనీయక చీకటి జీవితం లో చిరుగుల మాటున ఆణువణువూ చిత్రవధనుభవిస్తున్న బిడ్డ జన్మ కారకుడెవరో తెలియకున్నా అన్నీ తానై కన్న బిడ్డకు తానే ఓ ప్రపంచమై వెలుగుతున్న కొవ్వొత్తిలా కరిగిపోతుంటుంది... తనలో ఒక భాగమేగా తన బిడ్డంటే... మనసంత కన్న బిడ్డ చుట్టూనే ... తన బిడ్డ తనకు బంగారమే..


వేధిస్తూ నీ తలపులు వేదనలా నా కనుల నీరై జారుతుంటే కలగా మిగిలిన నీ రూపాన్ని ఊపిరి ఉలిగా చేసి మలుస్తున్నా... క్షణాలు యుగాలైన దారుల్లో మనమై పరుచుకున్న జ్ఞాపకాలన్నీ అపురూపంగా అందుకుంటూ... నీ వియోగంతో మది నిండిపోతోంది!...నిర్లిప్తంగా! నిన్నటిని మదిలోతుల్లోనించి వెలికితీయలేని నిస్సహాయతల్లో... అభిషేకిస్తున్నాయేమో కన్నీళ్ళలో తడిసిపోతున్నాయి కనురెప్పలు.. త్వరగా దరి చేరు ... మరణం నా మార్గంలో పలుకరించేలోగా!!!.