Tuesday, 12 May 2015

FACE BOOK నా జీవితాన్ని నిలపెట్టిందంటే నమ్ముతారా? మనిషి జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటాయి.ఒక మలుపు తొలి చినుకు భూమ్మీద పడ్డప్పుడు వచ్చే సువాసన లాగా ఉంటే,ఇంకొక మలుపు ఒక తుఫానూ వరదా వచ్చి ,మనం అప్పటి దాకా చవిచూసిన అనుభూతుల్ని అభిప్రాయాల్ని తుడిచి పెట్టేసి ,అసలు జీవితంలో ఏది శాశ్వతం ,ఎవరు శాశ్వతం అన్న సంధిగ్దంలో పడేస్తుంది . ఆ తర్వాత వచ్చే మలుపు,కొత్తగా చిగురించే మొలకలలాగా కొత్త ఆశల్ని పుట్టిస్తుంది.ఓహో జీవితం అంటే ఇంతే కాబోలు,ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది సర్లే అనుకునేలా చేస్తుంది. అలా సరిపెట్టేసుకుని ,ముందుకు సాగిపోయే సమయంలో ఒక మలుపు వస్తుంది చూసారూ! భూకంపం వచ్చి సమాధి ఐపోతున్నట్లు ,సునామీ వచ్చి కొట్టుకు పోతున్నట్లు ,పట్టుకోడానికి ఏ ఆసరా దొరక్క అల్లల్లాడి పోయే మలుపు వస్తుంది చూసారూ ,అప్పుడు నోరెళ్ళబెట్టి ఇదా జీవితం అంటే అన్న కనువిప్పుని కలుగచేస్తుంది . మన జీవితపు నాణ్యత విలువ మన చేతుల్లో వుండదు. దాన్ని మన చుట్టూ వుండే మానవ సంబంధాలు డిసైడ్ చేస్తాయి . .ఒక్కొక్కసారి మనం అమాయకంగా నమ్మిన సంబంధాలే ,అసత్యమై ,ఆవేశాలకీ,ఆవేదనలకీ, అపార్ధాలకీ గురి చేసి, ఒక భయంకరమైన అగాధంలోకి తోసేస్తాయి. జీవితంలో ఎదురయే ఈ అపశ్రుతులని సరిచేసుకోడంతోనే జీవితకాలం అయిపోతుంది . మాకు ఇలాంటి కష్టాలు రానే రావు అని విర్రవీగే వారికి ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తాను. జీవితం అంటేనే తీపి చేదు కలయిక, పోనీలేద్దురూ ! అని తీసిపారేయడమో,తమని తాము మభ్య పెట్టుకోడమో చేసే వాళ్ళమీద జాలి పడతాను. అసలు ఏ అసంత్రుప్తులూ లేకుండా జీవించే అద్రుష్టవంతుల సంఖ్య నామమాత్రం.వీరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న ఈ ఆఖరి మలుపులో , విధి మనతో భలేగా ఆడుకుంటుంది.మన స్వంతం అనుకున్న వారిని దారుణంగా దూరం చేసి విక్రుతానందాన్నిపొందుతుంది.దీనిని డీకొని గెలిచిన దాఖలాలు అంతగా కనిపించవు.మనకింతే ప్రాప్తం అనో ,నేనేమి పాపం చేసానని ఇలా ఒంటరినయ్యను అనో వాపోవాలి.లేదా లేనిపోని నవ్వుని ముఖాలమీద పులుముకొని నటించెయ్యాలి. ఇక్కడే ,ఇక్కడే,......!అన్నీ ఉన్నా,చక్కటి కుటుంబం ఉన్నా,ఏ లోటూ లేకపోయినా ,ఏమీలేదు అంటూ వాపోయే ఎడుపుగోట్టులని , జీవితం విలువ తెలియని మూర్ఘులుగా పరిగణించి మందలిస్తాను. నాబోటి ఒంటరిగాళ్ళకి, ఏ భగవంతుడి ధ్యానంలోనో ,సమాజ సేవలోనో,మునిగి తేలచ్చుగా, negitive ఆలోచనలు వద్దు అని చాల సులువుగా సలహాలు ఇవ్వచ్చు.కాని ఈ మనసుంది చూసారూ !తనేది కోరుకుంటుందో అదే కావాలని మొండిగా కోరుకుంటుంది . ప్రస్తుతం నా పిల్లలు ఉద్యోగ రీత్యా నాకు దూరంగా ఉన్నారు.వారు నా దగ్గర లేకపోవడం అనేది ఓ నరకయాతన లాంటిది.చిన్న వయసుల్లోనే సంసారాలని ఈదడం ,ఉద్యోగపు భారాలు మోస్తూ ,వాళ్ళకోసం వాళ్ళకే టైం లేకుండా అవస్థలు పడుతున్నప్పుడు,తీరిగ్గా నా వేదనని చెప్పుకుని వారికి న్యూనతా భావాన్ని కలిగించలేను. అసలే నా గురించి బాధపడుతున్నవారిని ఇంకా బాధపెట్టి కుంగ దీయలేను.అన్నీ దిగమింగుకుని పిల్లలు జీవితంలో సుఖంగా ముందుకి సాగిపోవాలని కోరుకునేదే తల్లి ప్రేమ మరి! నా పిల్లలు నా బెస్ట్ ఫ్రెండ్స్.అది నా అదృష్టం. నేను జీవించేదే వారికోసం.వారు చూపించే ప్రేమనురాగాలే నా ఉపిరి. వారు అనుక్షణం నా గురించే ఆలోచిస్తారు అన్నదానికి నిదర్శనం ,వారు నాకు ఒక laptop కొని ఇవ్వడమే. నన్ను నేను ఎలా బిజీ గా ఉంచుకోవచ్చు,FACEBOOK ని ఎలా వాడాలి నేర్పడమే. నా కోడళ్ళు సైతం నాకు guidance ఇస్తుంటారు. ఆశ్చర్యం! Face Book మీద రోజు రోజుకీ add అవుతున్న ఫ్రెండ్స్,' హలో' అనే వారి పలకరింపు, నాకు కొత్త ఉపిరిని పోస్తున్నాయి . వీళ్ళందరూ నిన్నటిదాకా దూరంగా ఉన్నారు.ఈరోజు నా రోజువారి జీవితంలో భాగస్వాములయ్యారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.నేను స్తబ్దుగా లేను కాబట్టి నా పిల్లలకి సంతోషం.నాకు నేను సృష్టించుకున్న గూటిలోంచి బయటికి వచ్చి మళ్లీ సమాజంతో చేతులు కలిపానన్న భావన. ఆఖరికి ,ఎన్నడూ లేని విధంగా కొత్త రీతిలో నా పుట్టినరోజు విషెస్ ని చెప్పించుకోడం తో నేను మళ్లీ పుట్టానని అనిపించింది. ఈ modern era లో నేనింకా బతికి ఉండి,కొత్త టెక్నాలజీ ని వాడుతున్నందుకు గర్వంగానూ ,ఆనందంగాను ఉంది.


No comments:

Post a Comment