Tuesday 12 January 2016

ఆత్మహత్యలకు కారకులు ఎవరు? "ఎందుకు బ్రతికుండాలి..?" అన్న స్ట్రగుల్ చాలామందికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది.. ఆ ఆలోచనలు బలం పుంజుకునే లోపు బ్రతకడానికి ఆశ క్రియేట్ అవకపోతే చనిపోవడమే సొల్యూషన్‌గా మిగులుతుంది.. ఇవ్వాళ ఉదయ్ కిరణ్ ఏ కారణాల వల్ల చనిపోయాడో అన్నది తెలుసుకుని కాసేపు బాధపడి రేపటికి మర్చిపోవడం కన్నా... వీటి మూలాలు గురించి ఆలోచించడం అత్యవసరం! ఉదయ్ కిరణ్ లానే చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు... చాలామంది "చనిపోయి ఏం సాధిస్తారు..." అంటూ ఆత్మహత్య చేసుకున్న వాళ్లని గుడ్డిగా నిందిస్తూ ఉంటారు గానీ.... బ్రతికుండగా ఈ మనుషులూ, ఈ మనుషుల మోరల్ సపోర్టులు ఏమైపోతాయో అర్థం కాదు. -------------------------- మనిషి ఎదుగుదలని చూసి ఓర్వలేని తనం... ఏవైనా రాజకీయాలు చేసేసి మనిషిని పడదోయాలనే కుళ్లులూ, కుతంత్రాలూ, కొన్నిసార్లు "ఈ మనిషి చచ్చిపోతే బాగుణ్ణు" అన్నంత శాడిస్టిక్ ఆలోచనలూ... వీటి వల్ల నరకం అనుభవిస్తున్న జనాభా మన చుట్టూ చాలామందే ఉన్నారు. వీళ్లల్లో కొంతమంది గుండె దిటవు చేసుకుని బ్రతికేస్తుంటారు, కొంతమంది తట్టుకోలేక బ్రతుకు ముగిస్తుంటారు. -------------- ఈ క్షణం ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఆలోచించండి.. మీరు ఎంత మందిని మానసికంగా చంపేస్తున్నారో పరీక్షించుకోండి... ఒక వ్యక్తిని ద్వేషించడానికి మీకుండే కారణాలు మీకు ఉండొచ్చు.. ఆ ద్వేషం చివరకు అవతలి మనిషిని దహించి వేసే స్థాయికి చేరడం మాత్రం మానవత్వం కాదు. అలాగే ఒంటరితనమూ...!! కొద్దిపాటి మోరల్ సపోర్ట్ కూడా లభించక, ఈ జీవితాన్ని ఏం చేయాలో తెలీక "చనిపోవాలనిపిస్తోందని" నా దగ్గర నీరుగారిపోయిన వాళ్లు కొంతమంది ఉన్నారు. మన ప్రయారిటీలన్నీ సక్సెస్ చుట్టూనే.... మనం విలువ ఇచ్చేది డబ్బున్నోడికో, గొప్ప గొప్ప పొజిషన్స్‌లో ఉన్నోడికో, సెలబ్రిటీలకో... తప్పించి మన చుట్టూ ఉన్న స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ ప్రోత్సహించే పెద్ద మనస్సు మనకు ఉండట్లేదు. ---------------- బ్రతికుండడానికి జీవితేచ్ఛ కావాలి.. ఆ జీవితేచ్ఛ పరిస్థితుల వల్లానూ, తమ చుట్టూ ఉన్న మనుషుల వల్లానూ క్రియేట్ అవకపోతే ఎవరైనా చనిపోక ఏం చేస్తారు? మనం మన తప్పిదాలన్నింటినీ మర్చిపోయి.. మనం మన చుట్టూ ఉన్న మనుషుల్ని కేరింగ్‌గా చూసుకోవడం మర్చిపోయి మన కరుణ రసాన్నంతా చనిపోయిన ఏ సెలబ్రిటీ మీదనో కార్చేస్తే లాభమేమిటి? మన చుట్టూ ఉన్నోళ్లు ఆత్మహత్యలు చేసుకోపోవచ్చు.. కానీ మన ప్రవర్తనల వల్ల వాళ్లు బ్రతికున్న జీవశ్చవాలుగానే మనసారా నవ్వుకి కూడా నోచుకోనంత దారుణంగా జీవించేస్తున్నారు.. మనం ఉద్దరించాల్సింది వాళ్లని.. లేదంటే ఈ ఆత్మహత్యలు ఆగవు!! ------------- ఒక మనిషి మాత్రమే చెయ్యగల గొప్ప పని తోటి మనిషిని సంతోషపెట్టడం... మన సంతోషం కోసం పక్క వాడి సంతోషాన్ని లాక్కోవడం కాదు.. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులు గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా జీవిస్తారు... అలా జీవింపజేయాలి తప్ప ఏ మూలలకో ముడుచుకుపోయి బ్రతికేలా మన రాక్షసత్వాన్ని ప్రదర్శించుకోకూడదు. ----------- గమనిక: దీనిలో ఓ vast మీనింగ్, ఆలోచనా జొప్పించాలని ప్రయత్నించాను.. ఎంతవరకూ అది జనాలకు రీచ్ అవుతుందో తెలీదు... బట్ మనం బ్రతుకుతున్న శైలి మాత్రం మనుషుల్ని బ్రతికించేలా లేదు.. చంపేసేలా ఉంది!! ఆ ఒక్కటి మాత్రం చెప్పగలను!!


No comments:

Post a Comment